మున్సిపల్‌ ఎన్నికలు : కౌంటింగ్‌ అప్‌డేట్స్‌

 హైదరాబాద్‌ : రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తయింది. మొత్తం 120 మున్సిపాలిటీలకు గాను 109 స్థానాలను సొంతం చేసుకున్న టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో నిలిచింది. 9 కార్పొరేషన్లకు గాను టీఆర్‌ఎస్‌ చోట్ల విజయం సాధించింది. ఇక కాంగ్రెస్‌ కథలో మార్పేమీ లేదు. ఆ పార్టీ కేవలం 4 మున్సిపాలిటీలను మాత్రమే కైవసం చేసుకుంది. బీజేపీ 3 మున్సిపాలిటీల్లో విజయం సాధించింది. ఈనెల 22న రాష్ట్రవ్యాప్తంగా 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.



కౌంటింగ్‌ ప్రక్రియ ఈరోజు (శనివారం) ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2619 కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓట్ల సంఖ్యను బట్టి 5 నుంచి 24 రౌండ్లపాటు కౌంటింగ్‌ ప్రక్రియ జరిపారు. మొదటగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కించిన అనంతరం బ్యాలెట్‌ పత్రాల ఓట్ల కౌటింగ్‌ను మొదలు పెట్టారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఒకవేళ ఓట్లు సమానంగా వస్తే లాటరీ ద్వారా అభ్యర్థి విజయాన్ని నిర్ణయించారు. కాగా, ఈ నెల 27న మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎన్నిక జరగనుంది. అదే రోజు కొత్త పాలక మండళ్ల తొలి సమావేశం జరనుంది. తొలి సమావేశంలోనే మేయర్లు, మున్సిపల్‌ ఛైర్మన్ల ఎన్నిక ప్రక్రియ నిర్వహించనున్నారు. సభ్యుల ప్రమాణం అనంతరం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు మేయర్లు, ఛైర్మన్ల ఎన్నిక జరగనుంది. ఆ వెంటనే డిప్యూటీ మేయర్లు, వైస్‌ ఛైర్మన్ల ఎంపిక జరగనుంది. ఇప్పటికే మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎంపిక కోసం నోటిఫికేషన్‌ జారీ అయింది.