జార్ఖండ్‌ ఫలితాలు: సీఎం రాజీనామా

రాంచీ: జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి షాకింగ్‌ ఫలితాలు ఎదురయ్యాయి. మొత్తం 81 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం కాంగ్రెస్‌-జేఎంఎం కూటమి అత్యధికంగా 47 స్థానాల్లో విజయం సాధించింది. మూడు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికారం బీజేపీ కేవలం 25 స్థానాలకు పరిమితం అయ్యింది. ఇతరులు 9 స్థానాల్లో విజయం నమోదు చేశారు. దీంతో ముఖ్యమంత్రి పదవికి రఘువర్‌దాస్‌ రాజీనామా చేశారు. ఫలితాల అనంతరం సోమవారం సాయంత్రం 7 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ద్రౌపది మూర్మాకు రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా తీర్పును గౌరవిస్తున్నట్లు తెలిపారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల సమస్యలపై పోరాటం చేస్తామన్నారు. కాగా ఫలితాలపై కాంగ్రెస్‌ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మోదీ పాలనపై ప్రజా తీర్పు వెలువడిందని అభిప్రాయపడుతున్నారు.


జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రహోంమంత్రి అమిత్‌ షా స్పందించారు. కాంగ్రెస్‌-జేఎంఎం కూటమికి అభినందనలు తెలిపారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నారు. పాలనలో కూటమికి అంతామంచి జరగాలని వారు ఆకాంక్షించారు. జార్ఖండ్‌ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఓ ప్రకటన విడుదల చేశారు.